అరుణాచల్ ప్రదేశ్‌లో 15 ప్రాంతాల‌కు చైనా పేర్లు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్‌, రోమన్‌ వర్ణమాల పేర్లను ప్రకటించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చైనీస్‌ పేరు జాంగ్నాన్‌. ఈ జాంగ్నాన్‌లోని 15 ప్రాంతాలకు కొత్తపేర్లు పెట్టినట్లు చైనా పౌర వ్యవహారాల శాఖ బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ టైమ్స్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది స్టేట్‌ కౌన్సిల్‌, చైనా కేబినెట్‌ జారీచేసిన భౌగోళిక పేర్ల నిబంధనలకు అనుగుణంగా ఉందని పేర్కొంది. కచ్చితమైన రేఖాంశం, అక్షాంశం ఇప్వబడిన 15 ప్రదేశాల అధికారిక పేర్లలో ఎనిమిది నివాస స్థలాలు, నాలుగు పర్వతాలు, రెండు నదులు, ఒక పర్వత మార్గం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని స్థలాలకు చైనా ఇచ్చిన ప్రామాణిక పేర్లలో ఇది రెండవ జాబితా. ఆరు స్థలాలకు ప్రామాణిక పేర్లు సూచిస్తూ 2017లో మొదటి జాబితా విడుదలైంది.

తాజా జాబితాలోని ఎనిమిది నివాస స్థలాలలో షానన్‌ ప్రిఫెక్చర్‌లోని కోనా కౌంటీ సంగ్‌కేజోంగ్‌, డాగ్‌లుంగ్‌ జాంగ్‌,మణిగ్యాంగ్‌, డ్యూడింగ్‌, మిగ్‌పైన్‌ మెడోగ్‌ కౌంటీ ఆఫ్‌ నైన్చి, గోలింగ్‌, జాయు కౌంటీలోని న్యింగ్‌చి డంబా తదితర ప్రాంతాలున్నాయి. ఇక వామో రి, డు రి, లెన్‌జుబ్‌ రి, కుమ్‌మింగ్‌ ఫెంగ్‌ పర్వతాలున్నాయి. కాగా చైనా చర్యను భారత విదేశాంగ శాఖ ఖండించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లోని అంతర్భాగమని పునరుద్ఘాటించింది. బీజింగ్‌ ఈ ప్రాంతాన్ని తనదిగా చెప్పుకునేందుకు తరచూ ఇక్కడ భారతీయ అగ్రనేతల, అధికారుల పర్యటనలను నిరసిస్తూ ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/