తైవాన్ కు మరోసారి చైనా వార్నింగ్

స్వాతంత్ర్యం కావాలని మొండికేస్తే తైవాన్ తీవ్రమైన పరిణామాలకు సిద్ధం కావాల్సిందే: చైనా


బీజింగ్ : తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ కు స్వాతంత్ర్యం కావాలంటే ఆ దేశం తీవ్రమైన పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. తైవాన్ తమ సొంత దేశంలోని భూభాగమేనంటూ చైనా కొన్నేళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తైవాన్ కు బెదిరింపులనూ పంపిస్తోంది. ఆ దేశ గగనతలంలోకి యుద్ధ విమానాలను పంపుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది.

ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మా షియావోగ్వాంగ్ స్పందించారు. వచ్చే ఏడాది తైవాన్ రెచ్చగొట్టే విధానాలు, బయటి దేశాల శక్తులు తమ వ్యవహారంలో తలదూర్చడం మరింత ఎక్కువయ్యే అవకాశముందని అన్నారు. తైవాన్ ను శాంతియుత వాతావరణంలో చైనాలో కలిపేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, లేదూ తమకు స్వాతంత్ర్యం కావాలని తైవాన్ అలాగే మొండికేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తైవాన్ జలసంధిలో వచ్చే ఏడాది మరింత ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటుందన్నారు.

కాగా, తైవాన్ వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తైవాన్ మెయిన్ ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్ చైనాను అభ్యర్థించింది. తైవాన్ జలసంధిలో శాంతికి విఘాతం కలగకుండా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమది స్వతంత్ర దేశమని ఇప్పటికే ప్రకటించింది. తమ స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. ఇటు అమెరికా కూడా తైవాన్ కు అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే చైనా మరింత రెచ్చిపోతోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/