బ్రహ్మపుత్రపై చైనా మరో భారీ డ్యామ్‌

14వ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదన

China To Build Major Dam On Brahmaputra

బిజీంగ్‌: బ్రహ్మాపుత్ర నదిపై చైనా డ్యామ్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. టిబెట్‌లో ఆ హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న 14వ పంచవర్ష ప్రణాళికలో బ్రహ్మపుత్రపై భారీ హైడ్రో పవర్ కేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పవర్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా నిర్మిస్తుందని, యార్లుంగ్ జాంగ్డో నది (బ్రహ్మపుత్రను టిబెటన్లు పిలిచే పేరు)పై ఇది నిర్మితం కానుందని, దీని ద్వారా దేశవాళీ విద్యుత్ అవసరాలను తీరుస్తామని సంస్థ చైర్మన్ యాన్ జియోంగ్ వెల్లడించినట్టు ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.

తాజాగా ఓ మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, 2021 నుంచి 2025 వరకూ అమలు కానున్న పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని, 2035 నాటికి దేశ విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని దీనికి రూపకల్పన చేశామని ఆయన స్పష్టం చేశారు. చైనా హైడ్రో పవర్ పరిశ్రమలో ఈ ప్రాజెక్టు ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశ దీర్ఘకాలిక అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని స్పష్టం చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/