అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ20 సమావేశం‌.. చైనా గైర్హాజరు

China Skips Confidential G20 Meet In Arunachal: Sources

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జీ20 కాన్ఫిడెన్షియల్‌ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ రహస్య సమావేశానికి చైనా గైర్హాజరైంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్‌ తోసిపుచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. దీంతో ఈశాన్య సరిహద్దు వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణ వైఖరి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన జీ20 రహస్య సమావేశంలో చైనా ప్రతినిధులు పాల్గొనలేదని అధికార వర్గాలు తెలిపాయి.

జీ20 కూటమికి ప్రస్తుతం భారత్‌ అధ్యక్షత వహిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. దీనికి ముందు దేశంలోని 50 ప్రధాన నగరాల్లో పలు జీ20 కార్యక్రమాలకు భారత్‌ ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో ఆదివారం జీ20 కాన్ఫిడెన్షియల్‌ మీటింగ్ జరిగింది. పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించిన థీమ్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 సభ్య దేశాలకు చెందిన 50 మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.