తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య: బైడెన్

పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి

వాషింగ్టన్ : ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబ‌న్లు త‌మ అధీనంలోకి తెచ్చుకున్న నేప‌థ్యంలో వారికి చైనా నుంచి నిధులు అందుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను మీడియా ప్ర‌శ్నించింది. చైనా తీరుపై జో బైడెన్ స్పందిస్తూ… ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య ఉంటుంద‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలోనే దాని పరిష్కారం కోసం చైనా ప‌లు ఏర్పాట్లు చేసుకుంటోంద‌ని బైడెన్‌ తెలిపారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు చైనా కూడా ఈ ప్రయత్నాలు చేస్తోంద‌ని, తాలిబ‌న్ల విష‌యంలో ఇప్పుడేం చేయాలని ఆయా దేశాలు ఆలోచించుకుంటున్నాయ‌ని చెప్పారు.

ఆఫ్ఘ‌న్‌కు చేసే సాయాన్ని అమెరికా ఇప్ప‌టికే నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా, రష్యా వంటి దేశాలు తాలిబన్లకు నిధులు పంపుతాయ‌ని, ఆఫ్ఘ‌న్‌లో నెల‌కొంటోన్న‌ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాలిబ‌న్ల‌తో చైనా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఆఫ్ఘ‌న్‌లో తాలిబన్ల పాలన గుర్తించేందుకు చైనా సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/