కొత్త అధ్యక్షుడికి చైనా స్నేహగీతం

జో బిడెన్‌ను అభినందిస్తూ శుభాకాంక్షల సందేశం

China friendly anthem for US new president

అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జోబిడెన్‌కు చైనా స్నేహగీతం వినిపిస్తోంది. బిడెన్‌ పాలనలో అమెరికాతో చైనా సుహృద్భావ సంబంధాలు కోరు కుంటున్నదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుభాకాంక్షల సందేశం పంపించారు.

ప్రపంచ దేశాలన్నీ బిడెన్‌ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన రాకపోయినా ఎన్నికల తీరుతెన్నులు, లెక్కింపు ఫలితాల ఆధారంగా శుభాకాంక్షలు తెలియజేసినా చైనా మాత్రం నిన్నమొన్నటి వరకూ శుభాకాంక్షలు తెలియజేయలేదు.

కారణం ట్రంప్‌ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలేనని చెప్పాలి. రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాకు అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

వాణిజ్య వ్యవహారాల పరంగా, ఎగుమతి దిగుమతుల పరంగాను ఒక విధంగా ట్రేడ్‌వార్‌ నడిచింది.

ఒక దశలో యుద్ధం జరుగుతుందా అన్నట్లు ఉద్రిక్తతలు సైతం చోటు చేసుకున్నాయి. అమెరికా ఎలక్టోరల్‌ కళాశాల ఫలితాలు ప్రకటించేంత వరకూ వేచి చూసే ధోరణిలోనే చైనా అధ్యక్షుడున్నారు.

చివరికి ఎనిమిది కోట్లకు పైగా ఓట్లతోను, 303 సీట్లు సాధించిన జో బిడెన్‌ను అధికారికంగానే విజేతగా ప్రకటించారు. దీనితో జో బిడెన్‌ను అభినందిస్తూ చైనా అధ్యక్షుడు తొలిసారి శుభాకాంక్షల సందేశం పంపించారు.

ఆ సందేశంలో ప్రస్తావన కూడా ఎక్కువ భాగం దెబ్బతిన్న సంబంధాలపైనే నడిచింది. వ్యాపార, వాణిజ్య రక్షణ రంగాలకు సంబంధించి అమెరికా చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఒక దశలో యుద్ధం చేసుకుంటాయన్న ధోరణి కూడా ప్రపంచ దేశాలకు కలిగింది.

బిడెన్‌ గెలిస్తే చైనా గెలిచినట్లేనని ట్రంప్‌ కూడా తన ప్రచారంలో ఆరోపించారు.

అంతేకాకుండా రష్యా ఇతర దేశాలతో పాటు ఇపుడు చైనా కూడా తన ఓటమి కి కుట్రలు చేస్తోందని, చైనా కంపెనీల నుంచే బిడెన్‌కు ఎన్నికల విరాళాలు అందాయని ట్రంప్‌ ఆరోపణలు సైతం గుప్పించారు.

అక్కడితో ఆగలేదు. చైనా నుంచే వ్యాపించిన కరోనా వైరస్‌ను వూహాన్‌ వైరస్‌ అని చైనా మేడ్‌ వైరస్‌ అంటూ పలు అంతర్జాతీయ వేదికలపై చైనాను ట్రంప్‌ తూర్పారబట్టారు.

అంతేకాకుండా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సమగ్ర విచారణ జరిపించాలంటూ సుమారు 68 దేశాల అధినేతల సంతకాలతో కూడిన డిమాండ్‌ను డబ్ల్యుహెచ్‌ఒకు అందించారు.

వైరస్‌ కారణంగానే డబ్ల్యుహెచ్‌ఒ చైనా పక్షపాతిగా పని చేస్తోందని ప్రకటించి సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా డబ్ల్యుహెచ్‌ఒకు ఇస్తున్న వాటా నిధులను కూడా నిలిపి వేసారు.

ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే చైనాకు అమెరికా నుంచే అతి పెద్ద ముప్పు పొంచి ఉందన్న భావన ప్రపంచదేశాలకు సైతం కలిగింది.

అంతేకాకుండా భారత్‌ తో చైనా ఉద్రిక్తతలను ట్రంప్‌ ప్రస్తావిస్తూ చైనా ఆక్రమణ కాంక్షతో వ్యవహరిస్తోందని, భారత్‌ భూభాగం ఆక్రమించే యత్నాలకు పాల్పడకూడదని, ప్రాదేశిక సార్వభౌమత్వా నికి అమెరికా మద్దతిస్తుందని భారత్‌కు మద్దతుగా ప్రకటనలు కూడా చేసారు.

వీటన్నింటి నేపథ్యంలో చైనాకు అమెరికాకు సంబంధాలు దాదాపుగా పూర్తిగా దెబ్బతిన్నాయనే అన్ని దేశాలు భావించాయి. ట్రేడ్‌వార్‌ వల్ల కూడా చైనా భారీ నష్టాలు చవిచూసింది.

అక్కడితో ఆగకుండా చైనాకు చెందిన సుమారు 100కుపైగా యాప్‌లను భారత్‌ తరహాలోనే అమెరికా నిషేధించింది. వాణిజ్య విస్తరణలో ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ మనకు తెలిసిందే.

ఈ పరిణామ క్రమంలో తాజాగా జో బిడెన్‌కు చైనా అధ్యక్షుడు పంపించిన శుభాకాంక్షల సందేశం చర్చనీయాంశంగా మారింది.

అధికార మార్పిడికి ట్రంప్‌ ఆ దేశ పరిపాలనా విభాగం చీఫ్‌కు ఆదేశాలిచ్చిన తర్వాత కానీ చైనా బిడెన్‌ గెలిచినట్లు గుర్తించలేదు.

అందువల్లనే తుది వరకూ వేచి చూసిన చైనా ట్రంప్‌ ఆదేశాలతో బిడెన్‌ గెలుపును స్వాగతించిందని భావించాల్సి వస్తోంది.

అంతేకాకుండా చైనాతో తమ సంబంధాలు దెబ్బతినలేదని, దౌత్య సంబంధాలను అన్ని దేశాలతోను కొనసాగిస్తామని జో బిడెన్‌ స్పష్టం చేసారు.

బిడెన్‌కు పంపించిన సందేశంలో మన రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు పరస్పర ప్రయోజనాలకోసమే కాదని, యావత్‌ ప్రపంచానికి మేలు చేసే విధంగాఉంటాయని సూచించారు.

అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలన్నీ మన రెండు దేశాల స్నేహంపైనే ఆధారపడి ఉన్నాయని విస్మరించవద్దంటూ కొత్త అధ్యక్షుడికి సున్నితంగా సూచించిన జిన్‌పింగ్‌ అమెరికాతో స్నేహహస్తంకోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇరువురి మధ్య కీలక రంగాల్లో సహకారం ఉంటేనే ద్వైపాక్షిక బంధాలు మరింతగా ధృఢపడతా యన్న భావన జిన్‌పింగ్‌లో వ్యక్తం అయింది.

మొత్తంగాచూస్తే ట్రంప్‌ ఉన్నతకాలం అధ్వాన్నంగా మారిన సంబంధాలను పునరుద్ధరించు కోవడం కోసం చైనా తహతహలాడుతోంది. చైనా అధ్య క్షుడు జిన్‌పింగ్‌ స్నేహగీతం ఇందుకు బీజం వేసింది.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్, హైదరాబాద్

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/