భారత్ సహాయక విమానానికి అనుమతివ్వని చైనా?

వైద్య సామగ్రిని చైనాకు పంపేందుకు సిద్ధంగా ఉన్న భారత్

China-flight
China-flight

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో (కొవిడ్‌-19) చైనా వణికిపోతుంది. ఈవైరస్‌ దాడికి మృతుల సంఖ్య 2,300 దాటింది. మరోవైపు, చైనాకు సాయం చేసేందుకు భారత్ అపన్నహస్తం చాస్తున్నప్పటికీ ఆ దేశం నుంచి స్పందన రావడం లేదు. వైద్య సాయం నిమిత్తం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లేందుకు ఢిల్లీలో విమానం రెడీగా ఉంది. వాస్తవానికి 20వ తేదీనే ఈ విమానం వూహాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, చైనా నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో… విమానాశ్రయంలోనే అది నిలిచిపోయింది. కావాలనే చైనా క్లియరెన్స్ ఇవ్వడం లేదని మన దేశానికి చెందిన ఉన్నత స్థాయి అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. కరోనా దెబ్బకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న చైనాకు వైద్య సామగ్రిని పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, ఫీడింగ్ పంపులు తదితర అత్యవసర వస్తువులను పంపేందుకు సిద్ధంగా ఉంది. అయితే మన విమానానికి చైనా క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ఇదే సమయంలో ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వస్తున్న విమానాలను మాత్రం చైనా అనుమతిస్తుండటం గమనార్హం.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/