ఔషధాలు, వైద్య పరికరాలపై చైనా సుంకాల రద్దు

china
china

బీజింగ్‌: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో అమెరికా నుండి దిగుమతి చేసుకునే కొన్ని ఎంపిక చేసిన వైద్య పరికరాలు, ఔషధాలపై సుంకాలను రద్దుచేస్తున్నట్లు చైనా ప్రకటించింది. మార్చి 2 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చైనా టారిఫ్‌ కమిషన్‌ ఆఫ్‌ది స్టేట్‌ కౌన్సిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టారిఫ్‌ల మినహాయింపుల జాబితాలో సంబంధించి పేషెంట్‌ మానిటర్లు, రక్తమార్పిడి పరికరాలు, రక్తపోటును నిర్ధారించే పరికరాల వంటి వాటికి చోటు దక్కింది. నానాటికీ పెరుగుతున్న చైనా వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఈ పరికరాలు, ఔషధాలను దిగుమతి చేసుకుంటామని, ఈ పరికరాలు, ఔషధాల ఉత్పత్తికి సంబంధించి చైనా సంస్థల నుండి దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని కమిషన్‌ వెల్లడించింది. ఈ టారిఫ్‌ మినహాయింపులు నిర్ణీత కాలానికి వర్తిస్తాయని, అమెరికా నుండి దిగుమతి చేసుకోవాలనుకునే సంస్థలకు మద్దతుగా ఈ మినహాయింపులను ప్రకటిస్తున్నామని కమిషన్‌ అధికారులు తెలియచేశారు. ఈ మినహాయింపుల జాబితాలో ఫ్రోజెన్‌ పోర్క్‌, బీఫ్‌ వంటి ఆహారోత్పత్తులతోపాటు సముద్ర ఆహారోత్పత్తులు కూడా వున్నాయి. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా దాదాపు 7,500 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్‌ దిగుమతులపై సుంకాలను సగానికి తగ్గిస్తున్నట్లు చైనా ప్రభుత్వం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/