పిల్లలు పొద్దస్తమానం టివి చూస్తున్నారా

Children watch TV

పిల్లలు అదే పనిగా టివి చూస్తుంటే వారిలో మార్పు తేవాలి. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచే పిల్లలు టివి చూడటం నేర్చుకుంటారు. చాలా మంది మహిళలు టివిలో సీరియల్స్‌ చూస్తూ పిల్లతో హోం వర్క్‌ చేయిస్తుంటారు. దాంతో పిల్లలు తమకు తెలియకుండా వాటికి అలవాటు పడిపోతారు. తండ్రులేమో ఆఫీసు నుంచి వచ్చాక విశ్రాంతి కోసం ఫోనో, పత్రికలలో ముందేసుకుంటారు. ఉద్యోగినులైతే వంటా వార్పు, మరుసటి రోజు కోసం ప్లానింగ్‌ అంటూ పరుగులు పెడుతుంటారు. ఇలా వాళ్లు బిజీగా ఉండి పిల్లల అల్లరిని కట్టడి చేయడానికి టివి చూడనిస్తారు. చిన్నారు టివికే అతుక్కుపోవడం వల్ల బద్ధకం పెరిగిపోతుంది. కళ్లు కూడా అలసిపోతాయి. నిద్ర తగ్గిపోతుంది. ఈ ప్రభావం మరుసటి రోజు స్కూల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తోటివారితో కలవకపోవడం వల్ల భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండవు. ఇలా మానసికంగా, శారరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్ల

కూడా పిల్లలు టివి చూస్తుంటారు. ఏదేమైనా పిల్లలకు అది అలవాటుగా మారి అందులోనే ఆనందం వెతుక్కుంటారు. ఆ తరువాత బయటకు వెళ్లి ఆడుకోమన్నా ఆడుకోరు. హోంవర్క్‌ ఓ పట్టాన పూర్తి చేయరు. టివి కట్టేసి చదువుకోమన్నా వాళ్లకి కోపం వస్తుంది. దాంతో ప్రతిఘటించడం మొదలుపెడతారు. ఏడుస్తారు. అరుస్తారు. చేతిలో వస్తువులను విసిరేస్తారు. విరగొట్టడమూ చేస్తారు. సమయపాలన ఉండదు. బద్ధకానికి చిరునామాగా మారతారు. పిల్లలకు పదేళ్లు వచ్చిన ఇదే కొనసాగితే అప్పుడు మానమంటే మానరు. అలా కాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో కథల పుస్తకాలు చదివించడం, బొమ్మలు వేయించడం, సంగీతం నేర్పించడం, ఆటలు ఆడించడం లాంటివి చేయించాలి. బయటి ప్రపంచాన్ని చూపించాలి. వారాంతాల్లో పిల్లలను సరదాగా బయటకు తీసుకెళ్లాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పిల్లలను స్నేహితుల పిల్లలతో చుట్టల పిల్లలతో కలిసి ఆడుకునేలా చదువుకునేలా చూడాలి.
మరీ చిన్నారులయితే ప్లేస్కూళ్లు ఉన్నాయి. అదే కాస్త పెద్ద వాళ్లయితే సాయంత్రాలు స్కూలు, హోంవర్క్‌లు అయిపోయాక వాళ్లకు నచ్చిన అభిరుచికి సంబంధించిన తరగతుల్లో చేర్పించవచ్చు. రోజులో అరగంటకు మించి టివి చూడకుండా నియమం పెట్టాలి. చెప్పిన మాట విని టివి చూడటం తగ్గిస్తే చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. వాళ్లు అడిగినవి కొనివ్వాలి. దీన్ని బిహేవియర్‌ మాడిఫికేషన్‌ అంటారు.
మన ప్రవర్తన బాగా ఉంటే అమ్మానాన్నలు మెచ్చుకుంటారు. కావాల్సినవి కొనిపెడతారు అని వారు అనుకునేలా చూడాలి. పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు పెద్దవాళ్లు కూడా టివి చూడటం తగ్గించాలి. ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని మళ్లీ చూసుకునేలా సౌకర్యాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి వారు చదువుకుంటున్నప్పుడు టివి కట్టేయాలి. వీలయితే మీరు వారితో కలిసి ఆడండి. ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేయమని అడగండి. వారికి స్వేచ్ఛ కల్పిస్తూనే పిల్లల్ని గమనిస్తూ ఉండాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/