బాల్యవివాహాలతో పసిప్రాయం మసి

Children given Show Against Child Marriages (File)
Children given Show Against Child Marriages (File)

తెలంగాణలోని ఒక గిరిజన తండాలో ఒక ఉపాధ్యాయుడు మైనర్‌ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరభారతదేశంలోని ఇప్పటికీ చాలా గిరిజన తండాలలో మైనర్‌ బాలికలకు పెళ్లి చేస్తున్నారు. పట్టణాలలో కూడా పేదరికంతో బాధపడుతున్న తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని వదిలించుకునేందుకు చిన్నవయసులోనే వివాహం చేస్తున్నారు. 16 సంవత్సరాలకు వచ్చేసరికి వారు తల్లులుగా మారుతున్నారు. లేతవయసులోనే మోయలేని భారాన్ని మోస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవ్ఞతున్నారు. చిన్నవయసులోనే గర్భం దాల్చడం వల్ల రక్తహీనతకు గురవ్ఞతున్నారు. కారణం స్త్రీలంటే, బాలికలు అంటే చిన్నచూపు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎక్కడ స్త్రీలు గౌరవించపబడతారో అక్కడ దేవతలు నివాసముంటారని అర్ధం. భారతదేశ స్త్రీని దేవతగా భారత పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. నిజానికి స్త్రీలని దేవతలుగా పూజించకున్న, బానిసలుగా చూడకుంటే చాలు. వివాహం సార్వత్రికమైనది. తమ పరస్పర సంబంధాలలో భర్తకు, భార్యకు గల హక్కులను బాధ్యతలనూ, పాఠ్యాంశాలను నిర్వహించే నియమనిబంధనల సముదాయం వివాహమని ‘లండ్‌బేర్గ్‌ అనే సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయం. మాతృత్వ పితృత్వాలతో దాంపత్య సమ్మేళనమే వివాహం. సమాజం గురించి చెప్పిన వారిలో అరిస్టాటిల్‌, ప్లేటో, ఒక పురుషునికి ఒక స్త్రీకి జరిగే వివాహం మీద ఆధారపడిన పితృస్వామిక కుటుంబం మొట్టమొదటి రకం కుటుంబమని, కుటుంబంలో అధికారం గల వ్యక్తి తండ్రి అని వారు చెప్పుచున్నారు. అంటే పురుషున్నే గొప్పవాడుగా పరిగణిస్తున్నారు. స్త్రీలకు స్వేచ్ఛ, స్వతంత్య్రం, సమానత్వం అవసరం లేదని వీరి భావన.
2006లో ఢిల్లీ హైకోర్టు 15 సంవత్సరాల అమ్మాయిలు తమ ఇష్టప్రకారం వివాహామాడితే అది చెల్లుబాటు అవ్ఞతుందని,ఆ వయసులో అమ్మాయిలు విచక్షణతో ఆలోచించగలిగే స్థితిలో ఉంటారని, 15 సంవత్సరాల వయసులో తమ ఇష్టప్రకారం చేసుకునే వివాహాలు చట్టప్రకారం చెల్లుబాటు అయ్యెటట్లు చూడాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వలన దేశం మళ్లీ బాల్యవివాహాల వైపు మొగ్గుచూపే ఉండేది. ఈ తీర్పు ముఖ్యంగా స్త్రీలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందనటంలో సందేహం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం 1921వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల వయసులోపు వివాహబంధంతో బంధీ అయినవారు లక్షాఐదువేలమంది కాగా 10 సంవత్సరాల వయసులోపు అమ్మాయిలు 2 లక్షల 16వేలమంది. ఈ క్రమంలో బాల్యవివాహాలను నిషేధిస్తూ అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1929 సంవత్సరంలో శారద చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంలో ఆడపిల్లలకు వివాహ వయసు 14 సంవత్సరాలుగా, మగపిల్లలకు 18 సంవత్సరాలుగా ఉన్నవారిని మాత్రమే చట్ట ప్రకారం వివాహం చెల్లుబాటు అవ్ఞతుందని తెలియజేశారు.

1930వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. ఆ తర్వాత 1955లో హిందూవివాహ చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఆడపిల్లల వయసు 18 సంవత్సరాలుగా, మగపిల్లలకు 21 సంవత్సరాలుగా నిర్దేశించింది. ఈ చట్టం వచ్చి ఇప్పటికీ 60 సంవత్సరాలు గడిచినా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలు 50 లక్షలమంది, మగపిల్లలు 75 లక్షల మంది ఉన్నారు. వివాహాలు చేసుకున్న బాలికల్లో లక్షా 50వేలమంది 18 సంవత్సరాల లోపే భర్తలను పోగొట్టుకొని వితంతువ్ఞలై జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. కాని వాస్తవానికి ఎన్నోరేట్లు ఎక్కువగా వీరు ఉన్నారనటంలో సందేహం లేదు. దేశంలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్న రాష్ట్రం రాజస్థాన్‌ కాగా మధ్యప్రదేశ్‌, బీహార్‌ రెండవస్థానాలను ఆక్రమించాయి. బాల్యవివాహాల వలన స్త్రీలపై అనేక దుష్ఫ్రభావాలు పడతాయి.

స్త్రీల స్థితిగతులు దిగజరిపోతున్నాయి. చిన్నతనంలో వివాహాలు జరగడం వలన స్త్రీలు విద్య నేర్చుకోవడానికి అవకాశాలు తగ్గిపోతాయి. బాలికల చదువ్ఞ మధ్యలోనే మాన్పించడం జరుగుతుంది. దేశంలో ఇప్పటికి మహిళల చదువ్ఞ పురుషుల సంఖ్యకంటే చాలా తక్కువని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఇప్పుడు ఆ కొద్ది చదువ్ఞకు కూడా దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో వారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. బాలికల శరీర పెరుగుదల 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటుందని డాక్టర్ల అభిప్రాయం. మరి అలాంటిది, చిన్నతనంలోనే వివాహాలు జరగడం వల్ల బాలికలు అనారోగ్య సమస్యలపాలైపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీ సమయంలో రక్తహీనతకు లోనవ్ఞతున్నారు. రక్తహీనత కారణంగా గర్భం నిలబడని మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా ఒక లక్షా 85వేలు. చిన్నవయసులో వివాహాల వలన కాన్పు కష్టమై అనేకమంది మహిళలు మరణిస్తున్నారు.