శిక్ష కాదు గుణపాఠం కావాలి

CHILDREN CARE
CHILDREN CARE

శిక్ష కాదు గుణపాఠం కావాలి

చిన్న పిల్లల్ని ప్రతి విషయంలో అవమానించడం, కొట్టడం ఎంతవరకు సమంజసం? చిన్నప్పటి నుంచి పిల్లల్ని అణచిపెట్టి కొట్టి, తిట్టి క్రమశిక్షణలో పెడితేనే ముందు ముందు చరిత్రవంతులుగా తయారవ్ఞతారని చాలామంది పెద్దల అభిప్రాయం. కాని ఒక్కసారి ఆలోచిస్తే ఇది యధార్థం కాదనిపిస్తుంది. ఒకవేళ వారిని కొట్టి, తిట్టి మార్చాలనుకుంటే ఒకటో తరగతి, రెండో తరగతి ఇలా ఎన్ని తరగతుల్లోనైనా కొడుతూనే ఉంటారెందుకు? అలా మారితే మొదట్లోనే మారాలి కదా! కొట్టడమంటే ఒకవిధంగా జైల్లో నేరస్తుని శిక్షించినట్లే. నేరస్తులకు ఎంత కఠినంగా శిక్షించి నప్పటికి రోజూ అపరాధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శిక్షిస్తేనే బాగుపడతారా? కొట్టడం, తిట్టడం లేదా మానసికంగా, శారీరకంగా హింసించడం వలన మారడానికి బదులు మన నుంచి మరింత దూరమైపోతారు.

వారి మనసులో చేసిన తప్పు గురించి ఆలోచన రాకపోగా శిక్షించే వారిపట్ల దురభిప్రాయం, అసహ్యం ఏర్పడుతుంది. చిన్న, పెద్ద తప్పులేవైనా మనం ప్రేమతో వివరించి తమ తప్పు తెలిసొచ్చేలా చేసి అలా చేయడానికి బదులు ఏం చేయాలో చెబితే లాభముంటుంది. ప్రేమతో మర్యాదగా వ్యవహరిస్తే పిల్లల మనోబలం పెరగటం వలన వారి మనసులో మనపట్ల కూడా ప్రేమాభిమానాలు ఏర్పడతాయి.

ఈవిధంగా ప్రేమతో ప్రయత్నిస్తే పిల్లల జీవితాన్నే మార్చగలుగుతాం. స్కూల్‌ పిల్లల్ని సామాన్యంగా పరిశీలిస్తే వారు స్కూల్‌కి వెళ్లడానికి వెనకా, ముందు అవ్ఞతారెందుకంటే వారి మనసుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. పిల్లలు తమతో ప్రేమగా, స్నేహితుల్లా వ్యవహరించి అన్ని విషయాలలో సమతుల్యంగా ఉండి కొట్టని ఉపాధ్యాయులంటేనే మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. పిల్లలు పెద్ద వారికి గౌరవం, ప్రేమ ఇచ్చినట్లే పెద్దవాళ్లు కూడా తమకు ఇవ్వాలని కోరుకుంటారు. తప్పుచేసినా, చేయకపోయినా ఎలాంటి పరిస్థితు ల్లోన్నైనా అందరూ గౌరవాన్నే కోరుకుంటారు.

అనవసరంగా పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఎందుకు? ఇంత తెలిసి ఉండి పెద్దలే తప్పు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలూ తప్పులు ఎలాగూ చేస్తుంటారు. పిల్లలను పరివర్తన చేయాలంటే ముందు మనం పరివర్తన పొందాలి. పెద్దవారికి కామ, క్రోధ, లోభ, మోహమనే వికారాలు తప్పని తెలిసి కూడా చేస్తారు. అందరూ క్రోధం హింసతో సమానమే గాక పాపమని కూడా చెబుతారు. కాని అలా చెప్పిన పెద్దలే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే పిల్లలేమి గ్రహిస్తారు. ఒకవేళ నిజంగా మనం పిల్లల్ని మార్చాలనుకుంటే మొదట మనం అంత ర్మథనం, స్వచింతన చేయాలి.