బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం

P. Chidambaram
P. Chidambaram

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైల్లో జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడి దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరుతూ చిదంబరం తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కానీ, బుధవారం కానీ దీనిపై వాదనలను విననుంది. కాగా మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో చిదంబరం బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్‌ కోర్టు ఈ నెల 27 వరకు జ్యూడిషియల్‌ కస్టడీని పొడిగించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్‌ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/