కరోనా దెబ్బకు పడిపోయిన చికెన్ ధరలు

కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి, ఇంకా చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావంతో చాలా రంగాలు నష్టాల నుండి కోలుకోలేకపోయాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో మరోసారి అలాంటి పరిస్థితే అన్ని రంగాలపై ప్రభావం చూపనున్నట్లు కనిపిస్తుంది. కాగా కరోనా దెబ్బకు పౌల్ట్రీ రంగం కూడా కుదేలయ్యింది.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చికెన్ గురించి. సాధారణంగా వేసవి కాలంలో చికెన్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు ఆకాశానికి చేరుకుంటాయి. మొన్నటి వరకు కూడా చికెన్ ధరలు ఎక్కువగా ఉన్నా, ప్రజలు దానిపై ఇష్టంతో కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నాయి. దీంతో చికెన్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పౌల్ట్రీ నిర్వాహకులు అంటున్నారు.

ఈ ప్రభావంతో హైదరాబాద్‌లో చికెన్ ధరలు అమాంతం దిగొచ్చేశాయి. గత నెలలో కిలో చికెన్ రూ.270 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.150కి చేరింది. పరిస్థితులు ఇలాగే ఉంటే చికెన్ రేటు మరింత కిందకు వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. అయితే కరోనా భయంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు సంకోచించడమే చికెన్ డిమాండ్ పడిపోవడానికి ముఖ్య కారణమని విక్రయదారులు అంటున్నారు.