అమెరికాలో వరుస కాల్పుల కలకలం

చికాగో: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌ ఘటన మరువక ముందే చికాగోలో మరోసారి చోటుచేసుకున్నది. చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల్లో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడని, అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మూడు రోజుల క్రితం.. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ అనే కంపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/