చెన్నైకు నాలుగో విజయం…

పంజాబ్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై జట్టు…
కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసిన చెన్నై బౌలర్‌ హర్భజన్‌…

Chennai Team
Chennai Team

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌చేసిన చెన్నై జట్టులో డుప్లెసిస్‌ (54), ధోని (37 నాటౌట్‌), షేన్‌ వాట్సన్‌ (26) చేయడంతో నిర్ణీత ఓవర్లలో చెన్నై 3 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను సర్ఫరాజ్‌ ఖాన్‌ (67), లోకేశ్‌ రాహుల్‌ (55) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ సింగిల్స్‌ తీస్తూ స్కోరు బోర్డుని ముందుకు తీసుకెళ్లినా చివర్లో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో సర్పరాజ్‌ ఔట్‌కాగా చెన్నై విజయం లాంఛనమైంది. చివరి ఓవర్‌లో 25 పరుగులు అవసరం కాగా పంజాబ్‌ 3 పరుగులే చేసింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీంతో 22 పరుగుల తేడాతో పంజాబ్‌ ఓటమి చవిచూసింది. చెన్నై జట్టుకి ఈ ఐపిఎల్‌ సీజన్‌లో ఇది నాలుగో విజయం.

Dhoni
Dhoni

చెన్నై బ్యాటింగ్‌ సాగిందిలా….
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టులో మొదట ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌ శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలో వీరిద్దరూ మొదటి వికెట్‌కు 56 పరుగులు చేశారు. వీరి జోడీని అశ్విన్‌ విడదీశాడు. 7.2వ బంతికి షేన్‌ వాట్సన్‌ (24బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26) అశ్విన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లోభారీ షాట్‌కు ప్రయత్నించి సామ్‌ కరన్‌కు క్యాచ్‌ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత డుప్లెసిస్‌, సురేశ్‌ రైనాతో జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌ 44 పరుగులు చేశారు. జట్టు స్కోరు 100 పరుగుల వద్ద వరుస బంతుల్లో డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా ఔటయ్యారు. 13.3వ బంతికి డుప్లెసిస్‌ (38బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లతో 54) అశ్విన్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 13.4వ బంతికే సురేశ్‌ రైనా (20బంతుల్లో ఒక ఫోర్‌తో 17) అశ్విన్‌ బౌలింగ్‌లోనే బౌల్టయ్యాడు. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో వచ్చిన ధోని (23బంతుల్ల 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37), అంబటి రాయుడు (15బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 21) కాస్త నెమ్మదిగా ఆడినా చివర్లో బౌండరీలతో చెలరేగారు. వీరిద్దరూ అజేయంగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 160 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు తీశాడు.
పంజాబ్‌ బ్యాటింగ్‌ సాగిందిలా….
161 పరుగుల విజయలక్ష్యంతో జరిగిన పంజాబ్‌ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయాడు. 1.4వ బంతికి గేల్‌(7బంతుల్లో ఒక ఫోర్‌తో 5) హర్బజన్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆతర్వాత రెండు బంతుల వ్యవధిలోనే రెండో ఓవర్‌ చివరి బంతికి హర్భజన్‌ బౌలింగ్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌ డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌటయ్యాడు. అప్పటికి పంజాబ్‌ స్కోరు 2 వికెట్ల నష్టానికి ఏడు పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే ఔటవ్వడంతో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌, సర్పరాజ్‌ఖాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. వీరి జోడీని కుజెలింజన్‌ విడదీశాడు. 17.3వ బంతికి లోకేశ్‌ రాహుల్‌ (47బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55) కుజెలింజన్‌ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాపాడుతాడనకున్న డేవిడ్‌ మిల్లర్‌ ( 6) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. 18.6వ బంతికే చాహర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు. ఒక ఓవర్‌లో 26 పరుగులు చేయాల్సి ఉండగా చివరి ఓవర్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ (59బంతుల్లో 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 67) 19.4వ బంతికి కుజెలెజిన్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో పంజాబ్‌ 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 22 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌, కుజెలిజెనన్‌లు చెరో వికెట్లు, దీపక్‌ చాహర్‌ ఒక వికెట్‌ తీశారు. హర్భజన్‌ 4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి చెన్నై విజయంలో కీలకగా పనిచేశాడు.