విద్యుత్‌ వాహనాలతో కాలుష్యానికి చెక్‌

Electric Car charging
Electric Car charging

ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తున్న వాతావరణ కాలుష్యం, శిలాజ ఇంధన వనరుల కొరత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ నెలలో సరికొత్త వాహన పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్‌ కల్లా దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బిఎస్‌ 6 ప్రమాణాలతో ఇంధనాలు తయారు కావాల్సి ఉంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ చమురు ఇంధన సంస్థలన్నీ రమారమి 45వేల కోట్ల రూపాయల వ్యయంతో బిఎస్‌ ఆరు ప్రమాణాలకనుగుణంగా ఇంధనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాయి. ఈ ముసాయిదాలో మరొక కీలక అంశం దేశంలో విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీని వేగవంతం చేయడం, 2025 కల్లా 50శాతం కమర్షియల్‌ వాహనాలను విద్యుత్‌ ఆధారిత వాహనాలుగా మార్చాలని, 2030 కల్లా 100 శాతం వాహనాలు విద్యుత్‌ ఆధారిత వాహనాలే కావాలన్నది కీలక లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదాలో పొందుపరి చింది. ఈ ముసాయిదా కార్యరూపం దాలిస్తేరాబోయే దశాబ్దంలో రోడ్లపై విద్యుత్‌ ఆధారిత వాహనాలు తిరగాడుతూ కనిపిస్తాయి. పెట్రోల్‌ బంకులు క్రమంగా మాయం కావచ్చు. వాటి స్థానంలో చార్జింగ్‌ స్టేషన్లు కనిపించవచ్చు. 2019 డిసెంబరు నెల నాటికి గణాంకాలు చూస్తే చైనాలో ఒక్క సంవత్సరంలో 12 లక్షల విద్యుత్‌ ఆధారిత వాహనాలు విక్రయం అయ్యాయి. గత మూడేళ్లలో మొత్తం మీద ఆ ఒక్క దేశంలో 32 లక్షల వాహనాల విక్రయాలతో ప్రపంచంలో అగ్రభాగాన ఉంది. ప్రపంచంలో విక్రయమైన విద్యుత్‌ వాహనాలలో చైనాది 50 శాతం వాటా కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. గత ఏడాది చైనా అగ్ర నాయకుడు భారతదేశ పర్యటన సందర్భంగా విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనదేశానికి బదిలీ చేస్తానని హామీ ఇవ్వడం సంతోషకరం. చైనా స్ఫూర్తిని అందిపుచ్చుకొని విద్యుత్‌ వాహనాల తయారీలో భారతదేశం వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రప్రభుత్వం ప్రణాళికకు అనుగుణంగా మనదేశంలో వాహనాల తయారీ కంపెనీలు విద్యుత్‌ సంబంధిత సాంకేతికతపై పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. టాటా, మహీంద్ర కంపెనీలు ఇప్పటికే విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టాయి. అయితే బ్యాటరీలలో ముఖ్యమైన లిథియం కొరత కారణంగా, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో కోట్లాది రూపాయలు పరిశోధనల రూపంలో వ్యయం చేసిన కారణంగా విద్యుత్‌ ఆధారిత వాహనాల ధరలు ఆకాశానంటుతున్నాయి. విలాసవంతు లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వాహనాలు మరింత ప్రాచుర్యం పొందాలంటే ప్రభుత్వం వీరికి విరివిగా ప్రోత్సాహ కాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో 70 శాతం ద్విచక్ర వాహనాల వినియోగం ఉంది. ఈ-బైక్‌ల విషయంలో ఇంకా మనకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు. వినియోగదారులు సంప్రదాయ స్కూటర్లు, మోటారు సైకిళ్లస్థానంలో విద్యుత్‌ ఆధారిత ద్విచక్ర వాహనాలను వాడేందుకు, వాటి ధరలను సామాన్యులకు సైతం అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి. విద్యుత్‌ వాహనాల పట్ల వినియోగదారులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. భారతదేశంలో విద్యుత్‌ ఆధారిత వాహనాలకు ఎదురవ్ఞతున్న ప్రధాన సమస్య మౌలిక వసతులే. వేగంగా బ్యాటరీ చార్జింగ్‌ చేసే సదుపాయాలను, స్టేషన్లను విరివిగా ఏర్పాటు చేయాలి. వేగం, పెట్రోల్‌, డీజిల్‌ వాహనా లతో పోలిస్తే విద్యుత్‌ వాహనాల వేగం, పికప్‌ తక్కువగా ఉంటుంది. ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

  • సి.సాయిప్రతాప్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/