లా అండ్ ఆర్డర్ లేకనే రేపల్లె ఘటన జరిగింది : చంద్రబాబు

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండుంటే రేపల్లె అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. ఏపీలో అటవిక పాలన కొనసాగుతోందని, ప్రజలకు భద్రత కొరవడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విచ్ఛిన్నమయ్యాయని చెప్పడానికి పెరుగుతున్న క్రైమ్ రేటే నిదర్శనం అని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. గత కొన్నిరోజుల వ్యవధిలో రాష్ట్రంలో జరిగిన నేరాల వివరాలను, మీడియా క్లిప్పింగ్స్ ను, వీడియోలను కూడా తన లేఖలో పొందుపరిచారు.

రాష్ట్రంలో వైస్సార్సీపీ గూండాలు రెచ్చిపోతుంటే, పోలీసు శాఖ వారిని అదుపుచేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో హింస, నేరాలు కూడా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. గంజాయి వ్యవహారంలో వైస్సార్సీపీ నేతల పాత్ర ఉందని తెలుస్తున్నా, పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.

ఏలూరు జిల్లాలో జి.కొత్తపల్లి గ్రామ వైస్సార్సీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ మృతికి వైస్సార్సీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని మృతుడి భార్య ఆరోపిస్తోందని చంద్రబాబు తెలిపారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల నామినేషన్ సమయంలో జరిగిన దాడి విషయంలోనూ పోలీసుల వైఫల్యం కనిపించిందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ నేరాలకు కారకులైన నిందితులతో పాటు, నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులపైనా కఠినచర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/