అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు

తిరుపతి : నేడు తిరుమలలోని శ్రీవారిని టీడీపీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శ్రీవారిని ప్రార్థించానని ఆయన తెలిపారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని పునరుద్ఘటించారు.. అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రికరణతో ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని, ఇలాంటి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 45 రోజులుగా అలుపు సొలుపు లేకుండా అమరావతి ఏకైక రాజధాని కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరుపతి చేరుకున్న రైతులకు మద్దతిచ్చేందుకే తాను తిరుపతికి వచ్చిన్నట్లు వెల్లడించారు. అమరావతి మహోద్యమ సభకు తాను హాజరవుతున్నానని ప్రకటించారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతుల మహాపాదయాత్ర తుళ్లూరు నుంచి అలిపిరి వరకు కొనసాగగా మహాపాదయాత్ర ముగింపుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేడు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. మరోవైపు సభకు వచ్చే టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పలువురిని గృహ నిర్భందం చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/