టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు తొలి రోజు సమావేశాల చివర్లో ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిటీ తరఫున మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు.

చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో మరోసారి చంద్రబాబుకే పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు, కమిటీల ఏర్పాటుపై సర్వాధికారాలు చంద్రబాబుకే అప్పగించారు. అనంతరం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కాలువ శ్రీనివాసులు ప్రకటనతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పేదవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని వెల్లడించారు. తెలుగు జాతి కోసమే పనిచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు.

తెలంగాణలో చేసిన పనుల వల్ల, టీడీపీ వేసిన ఫౌండేషన్ వల్ల ఆ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో వైస్సార్సీపీ హయాంలో చేసిన విధ్వంసం వల్ల ఏపీ చివరికి వెళ్లే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. ‘మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత, అన్ని రాష్ట్రాలతో సమానంగా, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటీ, రెండూ స్థానాల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆ శక్తి, సత్తా టీడీపీ ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది’ అని బాబు అన్నారు.