కాసేపట్లో సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

మరికాసేపట్లో ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈరోజు 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్‌ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోలేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా 5KM మేర ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే గన్నవరం ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద పాసులు లేని వారిని పోలీసులు తిరిగి పంపించేస్తున్నారు.