ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : చంద్రబాబు

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరాం

న్యూఢిల్లీ: చంద్రబాబు బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు.

ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు. డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/