చంద్రబాబు సంచలన ప్రకటన : ముఖ్యమంత్రిని అయ్యాకే సభకు వస్తా

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తన భార్య శీలాన్ని కూడా సంకించే విధంగా సభలో కామెంట్లు చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ లో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు చంద్రబాబు. తన పై వ్యక్తి గతంగా దూషించారని బాబు అన్నారు.

అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును ‘లుచ్ఛా’ అంటూ నోటికి పని చెబుతుండగా.. మరోవైపు మరో మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు.

‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు.

అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.