అసెంబ్లీలో పోలవరం పై చర్చ..రూ. 10 లక్షలు ఇస్తామని జీవో విడుదల చేశామన్న జగన్

పునరావాసం పూర్తయిన తర్వాత పరిహారాన్ని బదిలీ చేస్తామని వ్యాఖ్య

cm-jagan-speech-on-ap-assembly

అమరావతిః ఏపి అసెంబ్లీలో పోలవరం అంశంపై సభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. పోలవరం బాధితులకు రూ. 10 లక్షల ప్యాకేజీ ఏమైందని టిడిపి సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… పోలవరం ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని చెప్పామని… చెప్పినట్టుగానే జీవో విడుదల చేశామని తెలిపారు. 2021 జూన్ 30న జీవో విడుదల చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎకరాకు రూ. 6.86 లక్షల పరిహారాన్ని ప్రకటించిందని… తాము అధికారంలోకి వస్తే రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పామని… చెప్పినట్టుగానే జీవోలో పేర్కొన్నామని తెలిపారు.

పోలవరం నిర్వాసితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే, పరిహారాన్ని బదిలీ చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారని… దాన్ని రిపేర్ చేసేందుకు తాము కుస్తీలు పడుతున్నామని చెప్పారు. పోలవరంకు కేంద్రం నుంచి రూ. 2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందని.. అయితే చంద్రబాబు వల్ల ఆ నిధులు బ్లాక్ అయ్యాయని తెలిపారు. ఆనాడే కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయాల్సిందని.. ఆ పని చేయకుండా, ఇప్పుడు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/