వైస్సార్ , కేసీఆర్ ల ఫై చంద్రబాబు పొగడ్తల వర్షం

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై టీడీపీ అధినేత చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. టీడీపీ పార్టీ నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకొని , 41 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్బంగా ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..వైఎస్ రాజశేఖరరెడ్డి , తెలంగాణ సీఎం కేసీఆర్ లపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజశేఖర్ రెడ్డి , కేసీఆర్ సహా.. తన తర్వాత వచ్చిన సీఎంలు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసినందుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు తానే కట్టానని తన మనస్సాక్షికి తెలుసు, పేరు, ఓటు కోసం‌ కాదని, తెలుగుజాతి కోసం తాను పనిచేశానన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని,హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి నిర్మాణం చేపట్టామని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని, హైదరాబాద్‌ను మానవవనరుల అభివృద్ధి కేంద్రంగా చేశానని, విభజన సమయంలో సమన్యాయం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు.

రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని , తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వివరించారు. తెలుగువాళ్ల కోసం ఏంచేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే, ఆ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసిపోయి భారీగా తరలి వచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. మనసులోంచి వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రిపేర్ అయి చెప్పలేదు. తెలుగు జాతి నాది. ఆ తెలుగు దేశం కోసమే పార్టీ పెడుతున్నా… దాని పేరే తెలుగుదేశం అని అప్పటికప్పుడు ప్రకటించారు” అని వివరించారు.

పసుపు రంగు శుభానికి చిహ్నమని, అందుకే నాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టి పెట్టుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జెండాలో నాగలి రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని వివరించారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ పార్టీ ఉంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు.