ఒప్పందాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
టిడిపి అధినేత చంద్రబాబు సూటి ప్రశ్న

అమరావతి: ప్రభుత్వం, రైతుల మధ్య ఒప్పందాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా అంటూ వైఎస్ఆర్సిపి సర్కారును టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సంక్రాంతి సంబరాలు అమరావతి కేంద్రంగానే జరగాలని, జీఎన్ రావు, బీసీజీ నివేదికలు భోగి మంటల్లో తగలబడాలని వ్యాఖ్యానించారు. రాజధానికి లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఎవరన్నారంటూ నిలదీశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసత్యాలు చెబుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అలాగైతే జగన్ కట్టుకున్న ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకు రాదా? అని అడిగారు. ప్రభుత్వం 3 ముక్కలు చేస్తే, బీసీజీ కూడా మూడు ముక్కలాట ఆడుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి ఉన్మాదంతో ప్రజలు జీవితాంతం బాధపడాల్సి రావడం దారుణమని అభిప్రాయపడ్డారు. తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయినా, విశాఖకు ఇన్ చార్జిగా ఉండేందుకు విజయసాయిరెడ్డి ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని కోసం పోరాటంలో టీడీపీ అమరావతి జేఏసీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు. రాజధాని సమస్య రైతులతే కాదు, ఐదు కోట్ల మంది ఆంధ్రులదని తెలిపారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/