ఆనవాయతీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? : చంద్రబాబు

వైస్సార్సీపీ మంత్రులు అశోక్ గజపతిరాజుపై వీధి రౌడీల్లా దాడికి తెగించారు: చంద్రబాబు

అమావతి: విజయనగరం జిల్లా రామతీర్థం కోదండ రామస్వామి ఆలయ నిర్మాణం శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. వేల ఎకరాలు దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజుపై వైసీపీ మంత్రులు వీధి రౌడీల్లా దాడికి తెగబడ్డారని ఆరోపించారు. రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని అన్నారు. అశోక్ పట్ల మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అరాచకాలు, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవని హెచ్చరించారు.

ఆలయాల్లో పాటించాల్సిన ఆనవాయతీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రొటోకాల్ పాటించాలన్న విషయం కూడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజును ట్రస్టు చైర్మన్ గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. ఆలయ నిర్మాణానికి అశోక్ విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకెవరిచ్చారని నిలదీశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/