కోడెల జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరు

నేడు కోడెల శివప్రసాద్ ప్రథమవర్ధంతి..నివాళులు అర్పించిన చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: నేడు టిడిపి సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి ఈ సందర్భంగా టిడిపి అధినేత స్పందించారు. ఆ ప్రజానేత స్మృతికి నివాళులు అంటూ పేర్కొన్నారు. ఏపి శాసనసభ తొలి స్పీకర్ గా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం అని కొనియాడారు. రాజకీయ కక్ష సాధింపులతో కోడెలను బలితీసుకుని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నిచేసినా ప్రజల మనస్సులో కోడెల జ్ఞాపకాలను చెరిపివేయలేరని తెలిపారు.

కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుందని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కన్వీనర్ గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం అని కీర్తించారు. అవయవదాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెలది అని చంద్రబాబు వివరించారు. ఓ వైద్యుడిగా పల్నాటి ముద్దుబిడ్డ అయ్యారని, రాజకీయనేతగా పల్నాటి పులి అనిపించుకున్నారని పేర్కొన్నారు. 36 ఏళ్ల పాటు టిడిపితో ఉండి ప్రజల కష్టనష్టాల్లో అండగా నిలిచిన నేత కోడెల అని వేనోళ్ల కీర్తించారు. అటువంటి నేత ఇవాళ మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు అని విచారం వ్యక్తం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/