ఇది రాష్ట్రానికే చేటు..చంద్రబాబు

సబ్బం హరి ఇంటికి నోటీసులు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటికి మరోసారి నోటీసులు అంటించడం పట్ల టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలు ఆలోచిస్తారు, ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని కూడా ఉత్తేజపరుస్తారు… కానీ వైఎస్‌ఆర్‌సిపి పాలకుల తీరు వేరని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనతో రాత్రుళ్ళు నిద్రకూడా పోతున్నట్టు లేదని వ్యాఖ్యానించారు. అందుకు నిదర్శనమే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ సబ్బం హరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించిందని, కానీ అంతలోనే భవనాలు తొలగించాలంటూ ప్రభుత్వం మరో నోటీసును పంపించిందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆ నోటీసును కూడా రాత్రివేళ ఇంటికి అంటించిపోయారని వెల్లడించారు. కక్ష రాజకీయాల కోసం పాలనా యంత్రాంగాన్ని, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం రాష్ట్రానికి చేటు తెస్తుంది అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఈ రకంగా స్పందించడం వెనుక వేధింపు లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/