పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్..

వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలంటూ సూచన

chandrababu

మంగళగిరి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వన్‌-టు-వన్ మీటింగ్స్‌ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. 2024 ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్‌ పెంచారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ ఆదేశించారు. 2024 లో పార్టీ అధికారంలోకి రావాలంటే నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు క్లాస్‌ పీకారు చంద్రబాబు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా విభజన తర్వాత నేతల మధ్య కోఆర్డినేషన్‌ కరవైందంటూ అసహనం వ్యక్తంచేశారు. ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పార్టీ సభ్యత నమోదులోనూ వెనకబడ్డారంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై కన్నెర్ర చేశారు.

ఇకపై ప్రతి నేత పనితీరును సమీక్షిస్తానని చెప్పారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తే కౌంటర్‌గా ప్రైవేట్‌ కేసులు వేయాలని సూచించారు. అత్యధిక మెజార్టీతో మంగళగిరిని గెలిచి చరిత్ర తిరగ రాయాలని నారా లోకేశ్ కు దిశా నిర్దేశం చేశారు. 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందన్న చంద్రబాబు.. తాను ఓడిపోయినా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువైనట్లు లోకేశ్ వివరించారు.

గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అలసత్వం వహించకుండా సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల్ని చైతన్యం చేయడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో వన్‌టువన్‌ మీటింగ్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, ఎన్నికలకు సన్నద్ధత, వ్యూహాలపై చర్చించారు. పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి కలిసి పనిచేయాలని సూచించారు.