పార్టీ నేతలకు హెచ్చరిక జారీచేసిన చంద్రబాబు

chandrababu naidu tele conference with party leaders

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..సొంత పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ దూకుడు పెంచింది. తాజాగా నిర్వహించిన మహానాడు సక్సెస్ కావడం , వేడుకకు పెద్ద సంఖ్య లో కార్య కర్తలు హాజరుకావడం తో నేతల్లో కొత్త ఉత్సహం నెలకొంది. మహానాడు సక్సెస్, సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చర్చించారు.

రాష్ట్రంలో జగన్ అసమర్థ, అధ్వాన్న పాలనతో వైఎస్సార్‌సీపీ పని అయిపోయిందని , ప్రజలు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. మహానాడు ఈ స్థాయిలో విజయవంతం అవ్వడానికి కారణాలు కూడా నేతలకు చంద్రబాబు వివరించారు. మూడేళ్ల అణిచివేతతో కార్యకర్తల్లో ఉన్న కసి.. పాలకుల నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజల అసంతృప్తే మహానాడు గ్రాండ్ సక్సెస్‌కు కారణం అన్నారు. కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా ఇబ్బందులు పెట్టినా వందల కిలోమీటర్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను జయప్రదం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన బస్సు యాత్రకు జనం లేక వెలవెల పోతే, మహానాడు దగ్గర కంట్రోల్ చెయ్యలేని స్థాయిలో జనం తరలిరావడం టీడీపీపై నమ్మకాన్ని చాటుతోందన్నారు.

పార్టీలో ఏ స్థాయిలోను గ్రూపులను సహించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇకపై గ్రూపులు కట్టే వారి విషయంలో కఠినంగా ఉంటానని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెంబర్ షిప్ డ్రైవ్ కూడా వేగవంతం చెయ్యాలని సూచించారు. తెలుగు దేశం పార్టీలో పార్టీ కమిటీల నియామకంపైనా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గ్రామ స్థాయి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని నేతలకు సూచించారు.