కేసీఆర్ గెలుపు కోసం చంద్రబాబు వ్యూహం?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ తెరాస పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కనుమరుగయ్యిందనే చెప్పాలి. తెలంగాణలో నామమాత్రంగా ఉన్న టీడీపీ నాయకులు కూడా ఇతర పార్టీల్లో చేరుందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు మాత్రం అస్సలు అంగీకరించడం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడుగా చంద్రబాబు చేస్తున్న వ్యూహం కూడా కేసీఆర్ గెలుపు కోసమే అన్నట్లుగా తయారైంది.

త్వరలోనే నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో తెరాస పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలా అనే అయోమయంలో ఉంది. కాగా ఈ ఉపఎన్నికలోనూ విజయఢంకా మోగించి దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేయాలిన కమల దళం ఉవ్విళ్లూరుతోంది. అయితే నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ తెలుగదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని, అందుకే అక్కడ పోటీ చేయాలని బాబు భావిస్తున్నాడట.

అయితే తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపని టీడీపీ ఇప్పుడు నాగార్జున సాగర్‌లో పోటీకి దిగితే, అది పరోక్షంగా కేసీఆర్ విజయానికి సాయం చేసినట్లే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ పోటీ చేస్తే బీజేపీకి రావాల్సిన ఓట్లు చీలిపోతాయని, దాంతో అధికార పార్టీ టీఆర్ఎస్ అలవోకగా గెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంటే సాగర్‌లో కేసీఆర్ గెలుపు కోసం బాబు వ్యూహం చేస్తున్నట్లే అని వారు అంటున్నారు.