జగన్ రాష్ట్రానికే ఐరన్ లెగ్..అంటూ కడప జిల్లాలో చంద్రబాబు ఘాటు విమర్శలు

బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్దీ రోజులుగా జిల్లాలలో పర్యటిస్తూ వైసీపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా కమలాపురంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని.. జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

జగన్ రాష్ట్రానికే ఐరన్ లెగ్.. జగన్ తో అన్ని వర్గాలకు కష్టాలన్నారు. ఏడుసార్లు కరెంట్ బిల్లులు పెంచారని.. చెత్త పన్నులతో జగన్ చెత్త పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఇంత చెత్త సీఎంను ఎవరూ చూడలేదని.. యువతను జగన్ దగా చేశారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని.. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారన్నారు. జగన్ ఇచ్చింది నవ రత్నాలు కాదు.. నవరంధ్రాలు అన్నారు. జగన్ మోసం చెయ్యని వర్గం అంటూ లేదు.. ఉద్యోగులు PRC ఎంత ఇచ్చారు.. CPS రద్దు ఏమైందని ప్రశ్నించారు. జగన్ మందుబాబుల బలహీనత కనిపెట్టి మద్యంపై రేట్లు పెంచి జేబులు ఖాళీ చేస్తున్నారన్నారు. J బ్రాండ్స్‌తో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. మద్యం రేట్లు పెరగడం వల్లనే నాటు సారా, గంజాయి వచ్చాయన్నారు. తన వయసు 72, కానీ తన స్ఫూర్తి 27 అంటూ బాబు వ్యాఖ్యలు చేశారు. ఈ యువత కంటే ఎక్కువ పనిచేస్తానని.. అలసిపోనన్నారు. వైసీపీ సైకోలను కట్టడి చేయడానికి గ్రామాల్లో అందరూ కలవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంకు మద్దతు ఇవ్వాలని.. తన కోసం కాదు రాష్ట్రం కోసం మద్దతు ఇవ్వాలన్నారు.