నిరసన దీక్షలో చంద్రబాబు

రాజధాని 13 జిల్లాలకు నడిబొడ్డున నిర్మించాలనుకున్నాం..చంద్రబాబు

chandrababu

అమరావతి: అమరావతి రైతుల ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ అభినందనలు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామ రాజు మనకు స్ఫూర్తిగా నిలవాలి. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి. రాజధాని ఎక్కడో తెలియదు. ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు.. ఈ రాష్ట్రానికి మంచి సిటీ కూడా లేని పరిస్థితి’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

‘తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఓ గొప్ప రాజధాని ఉండాలని కోరుకున్నాం. అదే మనం చేసిన తప్పా? అని నేను అడుగుతున్నాను. ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఈ రాజధాని. రాజధాని 13 జిల్లాలకు నడిబొడ్డున నిర్మించాలని అనుకున్నాం’ అని చంద్రబాబు తెలిపారు. ’29 వేల మంది రైతులు 34 ఎకరాల భూమిని త్యాగం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఈ గొప్ప పనిని చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌కు నాంది పలికాం. స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధాని వస్తే తాము కూడా బాగుపడతామని వారు కలలు కన్నారు. ఎన్నో సంస్థలు అమరావతికి వచ్చాయి. వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఉద్యోగాలు వచ్చేవి.. రాష్ట్రం బాగుపడేది’ అని చంద్రబాబు చెప్పారు. నిరసన దీక్షలో చంద్రబాబు, చినరాజప్ప, ఆనంద్‌బాబు, కనకమేడల, అశోక్ బాబు, వర్ల రామయ్య, పట్టాభి కూర్చున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/