ఇది శాసనసభ కాదు… కౌరవ సభ : చంద్రబాబు

chandrababu

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఉద్రిక్తత ఫై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అంటూ పేర్కొన్నారు. సోమవారం సభలో జీవో నెంబర్‌ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి , సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేసి, 11 మంది టీడీపీ సభ్యులను ఓ రోజు సస్పెండ్ చేసారు.

ఈ ఘటన పట్ల చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్ కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ పేర్కొన్నారు. మరోపక్క టీడీపీ సభ్యుడు బాల వీరాంజనేయ స్వామి స్పీకర్ పై దాడికి ప్రయత్నించారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఎలిజా వెళ్లగా, ఆయనను కూడా కిందకు తోసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఈ దాడి విజువల్స్ ను విడుదల చేయాలని స్పీకర్ ను కోరారు.