కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారు ?: చంద్రబాబు
ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య

అమరావతి: తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ఏపీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. అయితే ఈ విషయం లో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆ ఘటనపై ఓ ప్రకటన చేస్తూ… జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
కాగా, ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇన్నోవా కారులో తిరుపతికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అల్పాహారం కోసం ఓ హోటల్ వద్ద దిగారు. అంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి కారును తీసుకువెళ్లాడు. కారును ఎందుకు తీసుకువెళ్తున్నారో కూడా వారికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మరో పోలీసు వచ్చి అసలు విషయం చెప్పడంతో వారు అవాక్కయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/