చిరంజీవి వంటివారు జగన్ ను ఇంతగా ప్రాధేయపడాలా?

సినీ పరిశ్రమను జగన్ కించపరిచారు: చంద్రబాబు


అమరావతి: తెలుగు సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ కించపరిచారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి వంటివారు జగన్ ను ఇంతగా ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని జగన్ వదిలేశారని విమర్శించారు. ప్రత్యేకహోదాపై మీ యుద్ధం ఏమైందని ప్రశ్నించారు. హోదా కోసం రాజీనామాలు చేయాలంటూ ఆనాడు మీరు విసిరిన సవాళ్లు ఏమయ్యాయని అడిగారు. కేంద్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా కనిపించగానే అంత మా ఘనతే అని చెప్పుకుని… అజెండా నుంచి హోదాను తొలగించగానే టీడీపీపై బురద చల్లుతారా? అని మండిపడ్డారు.

ఏపీ ఆదాయం బాగున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు సరఫరా సక్రమంగా లేకపోయినా… అధిక కరెంటు బిల్లులు వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/