ప్రతి కొత్త సిఎం వచ్చి రాజధాని మార్చుతామంటే చెల్లుతుందా?: చంద్రబాబు

టిడిపి ఆఫీసులో లీగల్ సెల్ సమావేశం..హాజరైన చంద్రబాబు

మంగళగిరిః నేడు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ సమావేశానికి విచ్చేశారు. లీగల్ సెల్ కొత్త కమిటీ సభ్యులతో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టిడిపి అని వెల్లడించారు. టిడిపికి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు టిడిపికి వచ్చాయని అన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జీవితంలో ఊహించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థను వైఎస్‌ఆర్‌సిపి భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ శాఖను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

ఇక, టిడిపి నేతల పట్ల పోలీసులు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నేత దారపనేని నరేంద్ర అరెస్ట్ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. “నేడు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది… పోలీసులు ఎవరైతే కొట్టారో వారి పేర్లు కూడా ఉన్నాయి. ఎవరో లక్ష్మణరావు అంట… సీఐ! మరో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు… అందరి చరిత్రలు రాస్తున్నా. తప్పుచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదు. ఏమనుకుంటున్నారు మీరు? చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు కూడా శిక్ష తప్పదు. చట్టాన్ని అతిక్రమిస్తే వారి గుండెల్లో నిద్రపోతా. ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు గడిచాయి.. ఈ ఉన్మాదులతో మరో సంవత్సరం గడవాలి” అంటూ వ్యాఖ్యానించారు.

“ఆ రోజున నేను హైదరాబాదును అభివృద్ధి చేశాను. నేను ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు హైటెక్ సిటీని కూలదోసి ఉంటే ఇవాళ అభివృద్ధి ఉండేదా? శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగు రోడ్డును ఆపేసి ఉంటే అభివృద్ధి జరిగేదా? అప్పుడు ఉన్నది ఎవరో కాదే వీళ్ల తండ్రే. అతడు దేన్నీ ఆపలేదు కానీ, పేరు మార్చారు… అది వేరే విషయం. ఇవాళ హైదరాబాద్ ఉన్నతస్థాయిలో ఉందంటే నేనిచ్చిన విజనే కారణం. నాడు ఎవరూ అభ్యంతర పెట్టలేదు” అని వివరించారు. రాజధాని అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ, నాడు అమరావతే ముద్దు అని ఈ సీఎం (జగన్) చెప్పాడని అన్నారు.

“మనది చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దు, రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యన ఉండాలని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు విముఖత ప్రదర్శిస్తున్నాడు? అమరావతి అంటే నీకెందుకంత కంపరం? ప్రతి కొత్త ముఖ్యమంత్రి వచ్చి రాజధాని మార్చుతామంటే చెల్లుతుందా? కేంద్రం ఏం చెప్పింది… రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని వెల్లడించింది. హైకోర్టు కూడా అదే చెప్పినా, వితండవాదం చేస్తున్నారు” అని విమర్శించారు.

ఇప్పుడు మూడు రాజధానులు అంటూ సమాజంలో ప్రాంతీయ విద్వేషాలు కలిగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “నీకు విశాఖపై ప్రేమ ఉంటే ఏంచేశావు? హెచ్ఎస్ బీసీ సంస్థ విశాఖ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. లులూ గ్రూప్ వెళ్లిపోయింది, ఫార్చ్యూన్-500 కంపెనీల్లో కొన్ని వస్తే అవి కూడా వెళ్లిపోయాయి. ఈ రాష్ట్రానికే మేం రాం అంటూ ఇంకొందరు వెళ్లిపోయారు.

విశాఖలో రుషికొండ పరిస్థితిపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో అందరం చూశాం. అప్పట్లో విదేశీయులు విశాఖ వస్తే, ఆ రుషికొండను చూసి తాము వచ్చింది విశాఖకేనని నిర్ధారించుకునేవారు. అలాంటి రుషికొండకు నేడు బోడిగుండు చేసేశారు. కొండ అనేదే లేకుండా చేశారు. పర్యావరణానికి హాని కలిగించేవారిపై న్యాయవ్యవస్థలు ఉక్కుపాదం మోపిన ఘటనలు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/