వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు

వరద బాధితులకు రూ.లక్ష రూపాయిల నష్ట పరిహారం ప్రకటించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. గత పది రోజులుగా కడప , నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఎన్నో వందల ఇల్లు వరదలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో చంద్రబాబు కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

రాజంపేట మండలం మందపల్లిలో వరద బాధితులను పరామర్శించారు. పింఛా ప్రాజెక్ట్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో.. వరద నీరు అన్నమయ్య ప్రాజెక్ట్‌కు పోటెత్తి కట్ట తెగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందపల్లిలో ఒకే కుటుంబంలో 9మంది మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ లొ చనిపొయిన వారికి కోటీ రూపాయలు ఇచ్చారని… ఇక్కడ మాత్రం ఐదు లక్షలు మాత్రం ఇచ్చారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కొల్పొయారని మండి పడ్డారు. కాపాడగలిగిన ప్రభుత్వం కాపాడలేకపొయిందన్నారు. భారీ వర్షాలకు నష్ట పోయిన బాధిత కుటుంబాలకు తెలుగు దేశం పార్టీ తరఫున రూ. లక్ష పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.

బుధువారం ఉదయం చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రహదారిలో ముంపునకు గురైన ఆటోనగర్‌ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం లక్ష్మీపురం కూడలి, ఎమ్‌ఆర్‌పల్లె, శ్రీకృష్ణానగర్‌, సరస్వతినగర్‌, గాయత్రినగర్‌, దుర్గానగర్‌ ప్రాంతాల్లో వరదప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు.