చండీగఢ్​ ఎయిర్​పోర్ట్​కు భగత్​ సింగ్​ పేరు

చండీగఢ్​లోని ఎయిర్​పోర్టు పేరు.. ఇకపై షహీద్ భగత్​సింగ్​ విమానాశ్రయంగా మారనుంది. ఆదివారం మన్​ కీ బాత్​ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్​ 28న ఆయన జయంతి నేపథ్యంలో.. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆదివారం ‘మన్ కీ బాత్’ 93వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. ‘చీతాలు తిరిగి రావడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయారు. ఒక టాస్క్ ఫోర్స్ ఈ చీతాలను పర్యవేక్షిస్తుంది. అది ఇచ్చే రిపోర్టు ఆధారంగా చీతాలను ప్రజలు ఎప్పుడు సందర్శించవచ్చో నిర్ణయిస్తాం’ అని ప్రధాని మోడీ అన్నారు.

దశాబ్దాల తర్వాత చీతాలు తిరిగి భారత్​లో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణమన్నారు. ప్రస్తుతం చీతాలు టాస్క్​ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయని.. త్వరలోనే వాటిని చూసేందుకు ప్రజలకు అనుమతిస్తామని చెప్పారు. చీతాలకు కొత్త పేర్లు సూచించాలని ప్రజలను కోరారు. అలాగే జంతువుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలనే విషయంపైనా సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో పాల్గొన్నవారికి మొదట చీతాలను చూసే అవకాశం కల్పిస్తామని అన్నారు.