చలపతి రావు అంత్యక్రియలు పూర్తి

ఆదివారం గుండెపోటుతో మరణించిన నటుడు చలపతి రావు అంత్యక్రియలు బుధువారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తి అయ్యాయి. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న చలపతిరావు‌ను సినిమా వాళ్లంతా ముద్దుగా బాబాయ్ అని పిలుచుకుంటారు.

మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో ఆయ‌న క‌న్నుమూశారు. 1200కి పైగా చిత్రాల్లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో ఆయ‌న న‌టించారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బ‌ల్లి ప‌ర్రులో చ‌ల‌ప‌తిరావు జ‌న్మించారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో ఆయన భౌతికకాయాన్నిమహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు. ఈరోజు చలపతిరావుకు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చలపతి కుటుంబసభ్యులు.. కుమర్తెలతోపాటు.. హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, డైరెక్టర్ శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు.. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.