కేవలం రూ.50 లకే ఐదు ఎల్ఈడీ బల్బులు అందజేస్తూ రికార్డు నెలకొల్పిన కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం ఎల్ఈడీ బల్బు అంటే రూ. 100 లు పెట్టాల్సిందే. అలాంటిది కేవలం రూ. 10 లకే ఎల్ఈడీ బల్బు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే ఎల్ఈడీ బ‌ల్బుల‌ను అందించేందుకు స‌రికొత్త ప‌థ‌కాన్ని కేంద్రం తీసుకొచ్చింది. గ్రామ్ ఉజాలా పేరుతో చేప‌ట్టిన ఈ ప‌థ‌కంలో భాగంగా కేవ‌లం రూ. 10కే ఒక బ‌ల్బును అందించ‌నున్నారు. గ్రామాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా ఎల్ఈడీ బల్బులను ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ప్రకటించింది.

గ్రామ్ ఉజాలా యోజన కింద 50 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మైలురాయిని చేరుకున్నట్టు ప్రభుత్వ కంపెనీ కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) తెలిపింది. ప్రభుత్వ రంగానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ ఈ స్కీమ్ నిర్వ‌హ‌ణ‌ను చూసుకుంటుంది. తొలి విడతగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బల్బులను అందజేశారు. కేవలం రూ.10కే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసేందుకు సీఈఎస్ఎల్ ఈ పథకాన్ని మార్చిలో ప్రకటించింది. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే 2021 సందర్భంగా కేవలం ఒక్క రోజులోనే 10 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఘనతను సాధించింది.

సంప్రదాయ బల్బులకు బదులుగా ఒక్కో ఎల్ఈడీ బల్బును రూ.10కే మూడేళ్ల గ్యారెంటీతో 7 వాట్స్, 12 వాట్స్ తో వీటిని అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద, ప్రతి ఫ్యామిలీకి గరిష్టంగా 5 బల్బులను ఇస్తోంది. ఈ బల్బుల ద్వారా వార్షికంగా రూ.250 కోట్లను ప్రభుత్వం ఆదా చేస్తుంది. అంతేకాక 71 కోట్లకు పైగా యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేస్తుంది. మార్చి 31, 2022 వరకు ఈ ప్రోగ్రామ్ నడవనుంది.