జాతీయ కరోనా టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఈ నెల 21 నుంచి జాతీయ వ్యాక్సినేషన్
ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ టీకాలు

న్యూఢిల్లీ: జాతీయ కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జరగనుంది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందించనున్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు టీకాలు కేటాయించనున్నారు.

అయితే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వ్యాక్సిన్లు వృథా చేసే రాష్ట్రాలకు డోసుల కేటాయింపులో కోత విధించనున్నారు. వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారు. టీకాల లభ్యత సమాచారం ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేంద్రం స్పష్టం చేసింది.


కాగా, కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/