ఏపిలో ఉల్లి రైతులకు కేంద్రం శుభవార్త

కృష్ణాపురం(కేపీ) ఉల్లి ఎగుమతులను అనుమతించాలని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం

Onions
Onions

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపిలో ఎక్కువగా పండించే కృష్ణాపురం(కేపీ) ఉల్లి రైతులకు శుభవార్త తెలిపింది. కేపీ ఉల్లి ఎగుమతులను అనుమతించాలని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పార్లమెంట్‌లో ప్రకటించారు. కేవలం విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే పండించే కేపీ ఉల్లి ఎగమతుల నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాలని దేశ రాజధాని ఢిల్లీలో మంత్రులు, సంబంధిత అధికారులను కలిశారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు సైతం దీనిపై పలువురు కేంద్ర పెద్దలను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.

కృష్ణాపురం ఉల్లిని మైదుకూరు ప్రాంతం సహా కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో రైతులు పండిస్తారు. ఇది కేవలం సింగపూర్‌, మలేషియా, శ్రీలంక తదితర విదేశాలకు మాత్రమే ఎగుమతులు చేసేందుకు రైతులు పండిస్తారు. ఘాటు ఎక్కువ, చిన్న సైజులో ఉండడంతో వాటిని ఉపయోగించరు. కాగా దేశంలో ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిని విదేశాలకు ఎగుమతులు చేయరాదంటూ నిషేధం ప్రకటించింది. దీంతో కృష్ణాపురం ఉల్లి కూడా ఎగుమతులు చేయలేక పోవడంతో రైతులు డీలా పడ్డారు. ఇదిలా ఉండగా కర్నాటకలో ఇదే తరహాలోని రెడ్‌ రోస్‌ రకం ఉల్లిని ఇటీవల ఎగుమతుల నుంచి మినహాయించారు. ఈ రకంగానే కేపీ ఉల్లిని కూడా ఎగుమతుల నుంచి మినహాయించాలని రైతులు కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం… కేపీ ఉల్లి ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/