మరణశిక్ష ఖరారైతే వారంలోగా అమలు చేయాలి

మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి

Supreme court
Supreme court

న్యూఢిల్లీ: ఇకపై మరణదండన విధించబడిన ఏ దోషి పేరిటైనా, డెత్ వారెంట్ జారీ అయితే, శిక్ష అమలు వారం రోజుల్లో జరిగిపోవాలని కోరుతూ, ఇందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది. తమకు పడ్డ ఉరిశిక్షను వాయిదా వేయించుకునేలా, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతికి క్షమాభిక్ష వంటి పలు చట్టపరమైన అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఉరిశిక్ష విషయంలో దోషుల హక్కుల గురించి కాకుండా, బాధితుల తరఫున ఆలోచిస్తూ, ఈ మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ పిటిషన్ లో కేంద్రం అభిప్రాయపడింది. దోషులు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే, సహదోషుల రివ్యూ, క్యూరేటివ్ తదితర పిటిషన్లు ఎన్ని ఉన్నా, వాటిని పక్కన బెట్టాలని, అన్ని కోర్టులు, ప్రభుత్వాలు, జైళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేసే ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే, క్యూరేటివ్ పిటిషన్ దాఖలుకు నిర్ణీత కాలపరిమితిని విధించాలని సూచించింది. కేంద్ర హోమ్ శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/