విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తగ్గిదేలే అని అంటుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫాగన్ సింగ్ కులస్తే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతున్నట్లు తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసారు. 2021-22లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 913 కోట్లు లాభం వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర సర్కార్ పలుమార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నప్పటికీ..కేంద్రం మాత్రం ప్రైవేటీకరణకే మొగ్గుచూపిస్తుంది. పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నట్లుగా మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం దిగిరాకపోవడం గమర్హం.