‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం

మొత్తం 128 మంది పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 128 మందికి పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లకు పద్మభూషణ్ ప్రకటించారు. 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ ప్రకటించారు. మొగిలయ్య ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో దివంగత సైనికాధికారి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. దివంగత రాజకీయవేత్త కల్యాణ్ సింగ్, సాహితీ, విద్యారంగాలకు చెందిన రాధేశ్యామ్ ఖేమ్కా, కళాకారిణి ప్రభా ఆత్రేలకు కూడా పద్మవిభూషణ్ ప్రకటించారు.

ఈ ఏడాది 17 మంది పద్మభూషణ్ ప్రకటించారు. భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా పద్మభూషణ్ కు ఎంపికయ్యారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా కూడా పద్మభూషణ్ జాబితాలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయానికొస్తే ఏపీకి చెందిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ ప్రకటించారు. కళల విభాగంలో తెలంగాణకు చెందిన పద్మజా రెడ్డి పద్మశ్రీకి ఎంపికయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: