రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌపది ముర్ముకు ‘జెడ్‌ ప్ల‌స్’ భ‌ద్ర‌త

ఒడిశా: రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ముర్ముకు కేంద్రం.. జెడ్ ప్ల‌స్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌దికి బుధవారం నుంచి సీఆర్పీఎఫ్ ద‌ళాలు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.

కాగా, ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం.. ఒడిశాలోని రాయ్‌రంగ్‌పుర్‌లో ఉన్న శివాల‌యానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆలయ ప్రాంగణాన్ని చీపురు ప‌ట్టి శుభ్రం చేశారు. ఆ త‌ర్వాత దైవ ద‌ర్శ‌నం చేసుకున్నారు. జహీరా అనే గిరిజన ప్రార్థన స్థలాన్ని కూడా ఆమె సందర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు పొందుపరచి ఉన్నాయో.. వాటి ప్రకారమే పనిచేస్తానని ఆమె చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్​ జూలై 18న జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ముర్ము గెలిస్తే… ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతితో పాటు దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/