భారత్‌లో కరోనాపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ

విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన కేంద్రం

Union Health Minister Dr Harshavardhan
Union Health Minister Dr Harshavardhan

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు కరోనా వైరస్‌(కొవిడ్‌-19)కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. కరోనాపై కేంద్రం పూర్తి సన్నద్ధతతో ఉందని తెలిపారు.21 ప్రధాన విమానాశ్రయాల్లో, 12 ముఖ్య ఓడరేవుల్లో, 65 చిన్నతరహా ఓడరేవుల్లో ప్రయాణికులకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 5,57,431 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, 12,431 మందికి ఓడరేవుల్లో వైద్య పరీక్షలు చేపట్టామని వివరించారు. అంతేకాదు, అనేక దేశాలకు పర్యటించడంపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, చైనా, ఇరాన్, సింగపూర్, కొరియా, ఇటలీ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. కాగా భారత్‌లో ఈరోజు రెండు కరోనా కేసులు గుర్తించారు. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. దాంతో దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య ఐదుకి పెరిగింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/