కేంద్రం గుడ్ న్యూస్ : ఆరు పంటల కనీస మద్దతు ధర పెంపు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఆరు పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ మంగళవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పంటల మద్దతు ధర పెంచిన విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ మీడియాకు వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధర పెంచిన వాటిల్లో గోధుమలు, బార్లీ, ఆవాలు, కుసుమపువ్వు, పప్పులు వంటివి ఉన్నాయి.
2022-23 పంట సీజన్, 2023-24 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రబీ సీజన్‌లో ప్రధాన పంటలైన గోధుమ, నువ్వులతో పాటు శనగలు, మసూర్, బార్లీ, కుసుమ పంటల ఎంఎస్‌పీ పెంచారు. అత్యధికంగా మసూర్ ధరను క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేందమ్రంతి వివరించారు.
పెంచిన ధరలు చూస్తే..
గోధుమ పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2125కు చేరింది. అదే విధంగా బార్లీ పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1735కు చేరింది. శనగ పంట కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5335 పలకనుంది. పప్పుధాన్యాలపై క్వింటాల్‌కు రూ.6000, ఆవాలు పంటపై క్వింటాల్‌కు రూ.5450, కుసుమపువ్వు పంటపై క్వింటాల్‌కు రూ.5650 కనీస మద్దతు ధర కానుంది. ఈ పెరిగిన పంటల కనీస మద్దతు ధర 2023-24 సంవత్సరాలకు వర్తించనుంది.