సామాన్యులకు షాక్.. గ్యాస్ ధరలను 40% మేర పెంచిన కేంద్రం

ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యులకు దడ పుడుతుంది. ఏ వస్తువు ఎంతమేర పెరుగుతుందో అని భయపడుతున్నారు. తాజాగా ఈరోజు అక్టోబర్ నెల మొదలైంది. గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. విద్యుదుత్పత్తికి, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు ధరలను 40 శాతం మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సహజవాయువును కంప్రెస్‌ చేసినప్పుడు అది వాహనాలను నడపడానికి (కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌-సీఎన్‌జీగా), వంట గ్యాసుగా (పైప్డ్‌ వంటగ్యాస్-పీఎన్‌జీ) ఉపయోగపడుతుంది. నేటి నుంచి 6 నెలల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) వెల్లడించింది. CNG వాహనాల్లో, ఇళ్లల్లో వంట కోసం వినియోగించే పైపులైను గ్యాస్ గాను సహజవాయువును వినియోగిస్తారు. ధరల పెంపుతో CNG నీ వినియోగించే వాహనదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

నిజానికి ఎరువుల ధరలు కూడా పెరగాలిగానీ.. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ భారం ఎరువులను కొనుగోలు చేసేవారిపై పడదు. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఈసీ) ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం.. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువుకు (పదిలక్షల బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్లకుగాను) ప్రస్తుతం ఉన్న 6.1 డాలర్ల ధరను 8.57 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కొత్త క్షేత్రాలు, చమురు వెలికితీత క్లిష్టమైన క్షేత్రాల (కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్‌, బ్రిటిష్‌ పెట్రోలియం కలిసి నిర్వహిస్తున్న డీప్‌ సీ డీ6 బ్లాకు వంటివాటి) నుంచి తీసే సహజవాయువుకు ప్రస్తుతం ఉన్న 9.92 డాలర్ల ధరను 12.6 డాలర్లకు పెంచింది. 2019 ఏప్రిల్‌ నుంచి సహజవాయువు ధరల పెంపు ఇది మూడోసారి.